గాజాలో హమాస్, ఇజ్రాయేల్ మధ్య జరుగుతోన్న పోరులో పౌరులు సమిధులుగా మారుతున్నారు. హమాస్ స్థావరాల పేరుతో ఆస్పత్రులు, శరణార్థ శిబిరాలను ఇజ్రాయేల్ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వెనక్కి తగ్గడం లేదు. శనివారం రాత్రి మళ్లీ ఇజ్రాయేల్ అనుమానష చర్యలకు పాల్పడింది. సెంట్రల్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై మరోసారి వైమానిక దాడికి తెగబడింది. దీంతో శిబిరంలోని అల్ ఫకూరా పాఠశాలలో తలదాచుకుంటున్న 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడినట్టు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సంస్థ తెలిపింది.
ఆల్-ఖద్ ఆసుపత్రి సమీపంలోనూ ఇజ్రాయేల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 21 మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. గాజాపై ఇజ్రాయేల్ దూకుడును అడ్డుకునే ఉద్దేశంతో లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్‌బొల్లా దాడులు శనివారం కూడా కొనసాగాయి. అటు, కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయేల్ ఒప్పుకోకపోవడంతో తమ రాయబారిని వెనక్కి రప్పిస్తున్నట్లు తుర్కియే ప్రకటించింది. కానీ, దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం లేదని మాత్రం వెల్లడించింది. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తానిక మాట్లాడబోనని తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ స్పష్టం చేశారు.
అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయేల్‌కు అండగా నిలవడాన్ని ఆయన తప్పుపట్టారు. లాటిన్ అమెరికా దేశం హోండురస్ సైతం తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే జోర్డాన్ తన రాయబారిని ఇజ్రాయేల్ నుంచి వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కాల్పులు విరమణ, పాలస్తీనా క్షతగాత్రులను గాజా నుంచి ఈజిప్టుకు అనుమతించే వరకూ బందీలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హమాస్ తెగేసి చెప్పింది. విదేశీ బందీల విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. శరణార్ధ శిబిరం నిర్వహిస్తోన్న ఐక్యరాజ్యసమితి పాఠశాలపై ఇజ్రాయేల్ జరిపిన దాడిలో 12 మంది చనిపోయినట్టు హమాస్ ప్రకటన చేసింది.
గాజా నగరాన్ని హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ కేంద్రంగా ఇజ్రాయేల్ అభివర్ణించింది. కాగా, ఇప్పటికీ నగర పరిసర ప్రాంతాల్లో 350,000 నుంచి 400,000 మంది పౌరులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని అమెరికా ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ సాటర్‌ఫీల్డ్ తెలిపారు. ప్రస్తుతం మధ్య ఆసియాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు అరబ్ దేశాధినేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇజ్రాయేల్ ప్రధానిని కలిసి బ్లింకేన్.. కాల్పులు విరమణ పాటించాలని సూచించారు. దీనికి బెంజిమిన్ నెతన్యాహు ససేమిరా అన్నారు. ఉత్తర గాజాలోని హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియా నివాసాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. దాడి విషయాన్ని హమాస్ ధ్రువీకరించింది. ఆ ఇంటిలో హనియా ఇద్దరు కుమారులు ఉంటున్నారని పేర్కొంది.