ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో ఈనెల ఎనిమిదో తేదీకల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. కాగా తమిళనాడులో ఆవరించిన ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రంపైకి తూర్పుగాలులు వీస్తుండడంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ ప్రభావంతో కోస్తా, సీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు.. ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బాపట్ల, కృష్ణా, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కర్నూలులో 112.8 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా పలమనేరులో 50.4, కడప జిల్లా వల్లూరులో 33.4, నెల్లూరు జిల్లా సీతారామపురంలో 24.2, ప్రకాశం జిల్లా కంభంలో 22.8, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 22, చిత్తూరు జిల్లా శాంతిపురంలో 21.2, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 19.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈశాన్య రుతుపవనాలు కదులుతున్నాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయంటున్నారు.