దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ క్రమంలో మరోసారి ఢిల్లీలో వాహనాలకు సరి-బేసి విధానం అమలు చేయాలని నిర్ణయించారు. దీపావళి తర్వాత కాలుష్య ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళి మర్నాడు నుంచి నవంబరు 20 వరకూ సరి-బేసి విధానం అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం వెల్లడించారు. అలాగే, ఈ వారం మొత్తం విద్యా సంస్థలు పది, ప్లస్ 2 మినహా అన్ని మూసివేయాలని అదేశించారు. ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలనే మూసివేయగా.. తాజాగా, హైస్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షత జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. సరి-బేసి నిబంధనల ప్రకారం.. సరి సంఖ్యతో ముగిసే రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన వాహనాలు మాత్రమే సరి సంఖ్య రోజులలో ఢిల్లీ రోడ్లపై అనుమతిస్తారు. బేసి-సంఖ్య రోజులలో సరి సంఖ్యలు ఉన్న వాహనాలు తిరగడానికి అనుమతి ఉంటుంది. నవంబరు 20 తర్వాత సరి-బేసి నిబంధనను పొడిగించాల్సిన అవసరాన్ని తర్వాత సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.
ఇక, గతవారం రోజులుగా ఢిల్లీని విషపూరిత కాలుష్యం దుప్పటిటా కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో దశ కార్యాచరణ ప్లాన్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అత్యవసర సేవల వాహనాలు మినహా కాలుష్యానికి కారణం అయ్యే మిగతా ట్రక్కులు ఏవీ ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫోర్ వీల్ వాణిజ్య వాహనాలు కూడా అనుమతించమని స్పష్టం చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్ VI వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది.
అలాగే, రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణ పనులు, కూల్చివేతలు పూర్తిగా నిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని నిబంధనలు విధించారు. మిగతా 50 శాతం మంది సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. గాలిలో పీఎంజీ 2.5 గాఢత ఎక్కువైతే ఊపిరితిత్తుల సమస్యలు సహా పలు అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కళ్ల దురద, గొంతు నొప్పి వంటి సమస్యలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.