తననెవరో చంపడానికి వస్తున్నారని.. తన వెంటపడుతున్నారని ఓ యువకుడు అందర్నీ కొద్దిసేపు టెన్షన్ పెట్టించాడు. తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఓ యువకుడు ప్రయాణిస్తున్నాడు. అతడు బోగీలోని బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని రైల్వే ఎమర్జెన్సీ నంబరు 139కు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఏలూరు స్టేషన్‌లో ఆగగానే రైల్వే ఎస్సై నరసింహారావు సిబ్బందితో వెళ్లి దాక్కున్న యువకుడిని బయటకు తీసుకొచ్చారు. భయంతో వణికిపోతున్న ఆ యువకుడికి రైల్వే పోలీసులు ధైర్యం చెప్పారు. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. అతడిని ఎవరు వెంబడిస్తున్నారన్నది మాత్రం క్లారిటీ లేదు. యువకుడు అనుమానంతో ఇలా చేశాడా.. నిజంగానే ఎవరైనా అతడ్ని వెంబడించారా అన్నది కూడా తేలలేదు. మొత్తానికి కొద్దిసేపు ఆ యువకుడు అందర్నీ టెన్షన్ పెట్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.