అమరావతికి భూ సమీకరణ కింద భూమిలిచ్చిన రైతులకు చెందిన నివాస ప్లాట్లలో సీఆర్‌డీఏ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. నిడమర్రు-బేతపూడి రహదారి పనులను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇవ్వకుండా.. అనుమతి లేకుండా వారి ప్లాట్లలో రోడ్లు ఎలా వేస్తారంటూ అధికారులను ప్రశ్నించింది. రైతులకు నోటీసులిచ్చి వారి వైఖరి ఏంటో తెలుసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. అధికారులు సీఆర్‌డీఏ నిబంధనలను పాటించాల్సిందేనని హైకోర్టు తెలిపింది.
రాజధాని అమరావతి కోసం భూమి ఇచ్చినందుకు తమకు ఇచ్చిన రెసిడెన్షియల్ ప్లాట్లలో అధికారులు ఏకపక్షంగా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారని అనపర్తి సునీత తరఫున ఆమె తండ్రి ఉప్పుటూరి శివనాగేశ్వరరావు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు పరిధిలో 960 చదరపు గజాల్లో ఉన్న తమ ప్లాట్ నంబరు 4004లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరారు.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. రైతులకు చెందిన ప్లాట్లలో ఏకపక్షంగా రహదారి పనులు ప్రారంభించారన్నారు. హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు నోటీసు ఇవ్వలేదని.. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రోడ్డు పనులను నిలిపివేశారు. సీఆర్‌డీఏ కమిషనర్, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్లు నిబంధనలు పాటించాలన్నారు న్యాయమూర్తి.