ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు మరో అద్భుతమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఊపిరితిత్తుల్లో సూది ఇరుక్కొని ఏడేళ్ల బాలుడు తీవ్ర అవస్థ పడుతుంటే ఆపరేషన్ చేసి ఆ సూదిని బయటికి తీసేశారు. అయితే బాలుడి ఊపిరితిత్తుల్లో ఉన్న సూదిని బయటికి తీసేందుకు డాక్టర్లు అయస్కాంతాన్ని ఉపయోగించారు. జ్వరం, ఇతర సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాలుడికి ఎక్స్ రే తీయగా ఊపిరితిత్తుల్లో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీశారు. అయితే సూది బాలుడి శరీరంలోకి ఎలా ప్రవేశించిందో తమకు తెలియనది బాలుడు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
7 ఏళ్ల బాలుడు, జ్వరం, రక్తం కారడం వంటి సమస్యలతో ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అయితే ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ఆ బాలుడిని తల్లిదండ్రులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మొదట అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు.. చివరికి ఎక్స్ రే తీశారు. అందులో అసలు విషయం వెల్లడైంది. ఆ బాలుడి ఊపిరితిత్తుల్లో ఎడమ వైపు సూది ఉన్నట్లు ఆ ఎక్స్ రేలో బయటపడింది. ఆ సూది ఊపిరితిత్తులో లోతుగా దిగడంతో ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తేల్చారు. అయితే ఊపిరితిత్తుల్లో ఉన్న సూదిని బయటకు తీసేందుకు డాక్టర్లు ముందు సర్జికల్ పరికరాలు ఉపయోగించారు. అయితే వాటితో ఆ సూది బయటికి రాలేదు. దీంతో వెంటనే అయస్కాంతాన్ని ఉపయోగించిన డాక్టర్లు ఆ బాలుడి ఊపిరితిత్తుల్లో ఉన్న సూదిని బయటకు తీశారు.
బాలుడి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న సూదిని తీయడానికి ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతం నుంచి 4 మిల్లీమీటర్ల వెడల్పు, 1.5 మిల్లీమీటర్ల మందం కలిగిన అయస్కాంతాన్ని డాక్టర్లు కొనుగోలు చేశారు. అయితే ఈ అయస్కాంతం అందుబాటులో లేకున్నా.. లేదా ఊపిరితిత్తుల్లో సూది కనిపించకపోయినా ఆ బాలుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేదని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యుడు డా. విశేష్ జైన్ తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆ బాలుడిని డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో సూది చాలా లోతులోకి వెళ్లడంతో సాధారణ ఆపరేషన్లతో పని జరగదని భావించి.. అయస్కాంతాన్ని తీసుకువచ్చినట్లు డాక్టర్లు వివరించారు. అయస్కాంతాన్ని శ్వాసనాళంలోకి వెళ్లకుండా సూది ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. ఇందులో అయస్కాంతం థ్రెడ్, రబ్బరు బ్యాండ్‌తో జాగ్రత్తగా కట్టినట్లు తెలిపారు.
ఇక ఈ సూది ఎడమ ఊపిరితిత్తుల్లో ఎక్కడ ఉందో ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనేందుకు ఎండోస్కోపీ నిర్వహించినట్లు చెప్పారు. దీని ద్వారా సూది యొక్క కొన మాత్రమే చూడవచ్చని.. దానికి అయస్కాంతాన్ని జాగ్రత్తగా సూది వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే అనుకున్నదానికంటే సులువుగానే ఆపరేషన్ పూర్తయిందని.. అయస్కాంతాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపించగానే.. సూది త్వరగా అక్కడికి వచ్చిందని.. దీంతో చాలా త్వరగా బయటకు తీయగలిగామని వైద్యులు వెల్లడించారు.