దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తీవ్రంగా ఉంది. అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయి.. డిసెంబర్ 3 వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వచ్చిన మర్నాడు నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది. ఈ మేరకు 2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. డిసెంబర్ 4 వ తేదీ నుంచి డిసెంబర్ 22 వ తేదీ వరకు ఈ వింటర్ సెషన్స్ నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
డిసెంబర్ 4 వ తేదీ నుంచి సెలవులు మినహాయిస్తే అదే నెల 22 వరకు మొత్తం 15 రోజుల పాటు పార్లమెంటు ఉభయసభలు సమావేశం అవుతాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. అయితే ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు లోక్‌సభ, రాజ్యసభల ముందుకు రావచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురానున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ బిల్లులు పార్లమెంటు ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత- 2023.. సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023.. ఇక ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో చెప్పారు. ఈ మూడు బిల్లులను ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తదుపరి పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించింది. ఈ 3 బిల్లులకు సంబంధించిన నివేదికలు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ శీతాకాల సమావేశాల్లోనే భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ 3 బిల్లులతోపాటు మరిన్ని కీలక బిల్లులు కూడా చట్టసభల ముందుకు రానున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను తీసుకువచ్చే ప్రయత్నం కేంద్రం చేసినప్పటికీ.. ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసనలతో విరమించుకున్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్న సీఈసీ, ఈసీ హోదాలను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావడానికి ఈ బిల్లులను తీసుకువచ్చారు.