విజయవాడ నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాలాలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. విజయవాడ 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో నిన్న బాలుడు కనిపించకుండాపోయిన ఘటన విషాదాంతమైంది. అష్రఫ్ (5) అనే బాలుడు బుధవారం (నవంబర్ 8) ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న పెద్ద నాలాలో పడిపోయాడు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఫలితం లేకపోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. ప్రమాదవశాత్తూ ఇంటిపక్కన ఉన్న నాలాలో పడిపోయి ఉంటాడనే అనుమానంతో.. ఆ దిశగా గాలించారు. ఇంటికి కొద్ది దూరంలో నాలాలో బాలుడి మృతదేహం కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విజయవాడ నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపించారు. నాలాలపై మెష్‌లు ఏర్పాటు చేయని కారణంగా ఈ విషాదం చోటు చేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జులైలోనూ ఇలాంటి విషాదమే చోటుచేసుకుందని, అయినప్పటికీ వీఎంసీ అధికారుల తీరు ఏమాత్రం మారలేదని మండిపడుతున్నారు. పోలీసులు బాలుడి మృతదేహానికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.