గూఢ చర్యం ఆరోపణలతో అరెస్ట్ అయి కొన్ని నెలలుగా ఖతార్ జైలులో మగ్గిపోతున్న 8 మంది భారతీయులకు మరణ శిక్ష విధిస్తూ ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన ఆ 8 మంది మాజీ ఉద్యోగులు.. ఖతార్ వెళ్లారు. అక్కడే ఓ ప్రైవేటు భద్రతా సంస్థలో పని చేస్తున్నారు. అయితే ఆ 8 మంది గూఢచర్యం చేస్తున్నారని.. ఖతార్ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అక్కడి అధికారులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని నెలలుగా వారిపై విచారణ జరగ్గా.. చివరికి కోర్టు వారికి మరణ దండన విధించింది.
అయితే భారత్‌కు చెందిన ఆ 8 మంది నేవీ మాజీ అధికారులకు పడిన మరణశిక్ష కేసులో తీర్పుపై ఇటీవలె అప్పీలు దాఖలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా అందుబాటులో లేవని తెలిపింది. ఈ తీర్పు ప్రైవసీ దృష్ట్యా దానికి సంబంధించిన పూర్తి వివరాలను కేవలం న్యాయ బృందంతోనే చర్చించే వీలు ఉందని పేర్కొంది. ఈ కేసులో ప్రస్తుతం అప్పీల్ చేశామని.. తదుపరి చట్టపరమైన మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
ప్రస్తుతం మరణ శిక్ష పడి.. జైలులో ఉన్న 8 మంది నేవీ మాజీ అధికారులను కలిసేందుకు ఖతార్ రాజధాని దోహాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి మరో అవకాశం లభించిందని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ మంగళవారం భారత రాయబార అధికారులు.. ఆ 8 మందిని కలుసుకోనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారికి అవసరమైన న్యాయపరమైన, దౌత్యపరమైన పూర్తి సహకారాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఖతార్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశామని.. 8 మంది బాధితుల కుటుంబ సభ్యులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలతో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఇటీవలే ఢిల్లీలో భేటీ అయ్యారని అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
ఖతార్‌లోని ప్రైవేటు భద్రతా సంస్థ అయిన అల్ దహ్రాలో పనిచేస్తున్న 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలు మోపిన అధికారులు.. 2022 ఆగస్టులో అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి 8 మంది జైలులోనే మగ్గిపోతున్నారు. అయితే వారిపై మోపిన అభియోగాలు ఏంటి అనే విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు. ఖతార్ అధికారులు మోపిన అభియోగాలను పరిశీలించిన అక్కడి కోర్టు.. 8 మందికి గత నెల చివరి వారంలో మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత సర్కార్.. అత్యంత ప్రాముఖ్యత గల ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేంద్రం.. తాజాగా ఆ తీర్పుపై అప్పీల్ చేసింది.