అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా పూర్తి కావస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ మంత్రివర్గ సమావేశాలు అయోధ్య నగరంలో ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం అయోధ్యలో యూపీ కేబినెట్ భేటీని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించారు. అయితే దీని వెనక ఒక ప్రత్యేకత ఉందని కమలదళం చెబుతోంది. సాధారణంగా ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశాలు.. అయోధ్యలో నిర్వహించడం ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలనే రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న అయోధ్యలో యూపీ కేబినెట్ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గురువారం ఉదయం అయోధ్యకు చేరుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇతర మంత్రులు ముందుగా హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. అనంతరం అక్కడే ఉన్న రామ్‌లల్లా ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణం జరుగుతున్న స్థలానికి చేరుకుని అక్కడి పనులను పరిశీలించారు. అక్కడి నుంచి రామకథ మ్యూజియంకు చేరుకున్నారు. అక్కడే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ నిర్వహించారు. అయితే ఈ కేబినేట్ సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే నవంబరు 9 వ తేదీ (గురువారం) రోజున అయోధ్యలో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉందని ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 1989 లో ఇదే నవంబరు 9 వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్ శంకుస్థాపన చేసినట్లు తెలిపాయి. దీంతోపాటు 2019 నవంబరు 9 న బాబ్రీ మసీదు-రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించిందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ఎడతెగని పంచాయతీగా ఉన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయితే తొలిసారి లక్నోలో కాకుండా అయోధ్యలో కేబినేట్ భేటీ నిర్వహించడంతో అక్కడ భద్రతను తీవ్ర కట్టుదిట్టం చేశారు. అయోధ్య నగరం మొత్తం ఏటీఎస్ బృందాలను మోహరించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు 2019 లో కూడా యోగి సర్కారు లక్నోలో కాకుండా ప్రయాగ్‌రాజ్‌లో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది.