గ్రామాల్లో సమావేశాలు ముగిశాక రాత్రికి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలో పార్టీ నేతలు బస చేశారు. శుక్రవారం ఉదయం వలంటీర్లు, గృహ సారథులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటికీ వలంటీర్లు, గృహ సారథులు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానులు వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలో వివరిస్తూ 24 పేజీలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికీ అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్ హామీల అమలు తీరు – చంద్రబాబు హామీల అమలు తీరుపై ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజాతీర్పు పుస్తకంలో ఆయా కుటుంబాల అభిప్రాయాన్ని నమోదు చేస్తారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని నేడు 721 సచివాలయాల పరిధిలో ప్రారంభించనుంది.