బాపట్ల జిల్లాలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు లంతచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. చుండూరు మండలం కేఎన్‌పల్లిలో గోవిందుకు తన స్వగ్రామంలో భూమి ఉంది.. ఆ భూమికి పక్కనే గత నెలలో ప్రభుత్వం సంపద సృష్టి కేంద్రం నిర్మాణానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అక్టోబరు నెల 7న మట్టి తోలి చదును చేయించారు.. ఈ క్రమంలో గోవిందు తన భూమికి సరిహద్దు సమస్యలు రాకుండా హద్దులు ఉండేలా చూడాలని అధికారులను కోరారు. అధికారులు హద్దుల్ని నిర్ణయించారు.. అయితే తనను పిలవకుండా ఏకపక్షంగా పనులు చేపట్టి తాను సాగు చేస్తున్న వరి పంటను నష్టపరిచారని భూమి వద్దకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు.
ఈ క్రమంలో గతనెల 7న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నాగమల్లేశ్వరరావు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించారని.. వాహనంతో ఢీకొట్టి చంపుతామని బెదరించారని ఫిర్యాదులో పేర్కొన్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గోవిందుకు చెందిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. తన కారును విడుదల చేయాలని గోవిందు కోరగా.. కేసు నమోదైందని.. ఆ కేసు లేకుండా చేయటానికి, సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయటానికి ఎస్సై భరత్‌కుమార్ రూ.75వేలు డిమాండ్ చేశారని చెప్పారు.
ఈ క్రమంలో కొంత డబ్బును గతంలోనే చెల్లించారు. తాజాగా ఫిర్యాది తమను సంప్రదించడంతో కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఫిర్యాదితో కలిసి స్టేషన్‌కు వెళ్లి రూ. 45 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పారు. ఎస్సైభరత్ కుమార్ ఆదేశాలు మేరకు ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దారా క్రాంతి కుమార్ రూ.45000/- బాధితుడి నుండి లంచం సొమ్ము తీసుకొని.. స్టేషన్ రైటర్ గా వ్యవహరిస్తున్న పోలీసు కానిస్టేబుల్ గరికపాటి రవీంద్రకు అందజేశారన్నారు. ఆ మొత్తాన్ని వారిద్దరూ తీసుకొని ఎస్సైకు అందజేయడానికి సర్కిల్ కార్యాలయానికి వెళుతుండగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఈ లంచం ఎస్సైకు ఇవ్వడానికి తీసుకెళుతున్నామని చెప్పటంతో వారిద్దరిని తీసుకొని ఎస్సై వద్దకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నామని ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400 నంబర్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నంబరును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నంబర్ ద్వారా ఏసీబీ అధికారుల్ని సంప్రదించాలన్నారు.