కాకినాడ జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలంరేపింది. బడికి వెళ్లిన బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. తండ్రికి ఫోన్ చేసి రూ.4 లక్షలు కావాలంటూ బెదిరించారు.. ఆ వెంటనే సోషల్ మీడియాలో చిన్నారి ఫొటోతో సహా వివరాలు వైరల్ కావడంతోపోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంతలో కిడ్నాపర్లు ట్విస్ట్ ఇచ్చారు. ర్యాపిడో బుక్ చేసి బాలుడ్ని ఇంటికి పంపారు. కాకినాడ జిల్లా సామర్లకోట బలుసులపేటకు చెందిన తొమ్మిదేళ్ల తాడి నాని.. నీలమ్మ చెరువు దగ్గర ఉన్న మున్సిపల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగే గురువారం కూడా స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసి సహచర విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదని.. నానిని ఇంటికి తీసుకువెళ్లాలి అని ఉపాధ్యాయురాలిని అడిగాడు. అనుమతి తీసుకుని.. రిజిస్టర్‌లో సంతకం కూడా చేశాడు. ఆ తర్వాత నానీని తన వెంట తీసుకువెళ్లాడు.
బాలుడిని ఎత్తుకెళ్లిన కొద్దిసేపటికి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు. మీకు అతడు కావాలంటే రూ.4 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. భయపడిన బాలుడి తండ్రి తాడి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. ఫోన్ కాల్ ఆధారంగా నంబరు లోకేషన్‌ను గుర్తించి అటు వైపుగా వెతికారు. మరోవైపు బాలుడి కిడ్నాప్ వ్యవహారం, అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. దీంతో కంగారుపడిన కిడ్నాపర్లు బాలుడిని కాకినాడ జేఎన్‌టీయూకే సమీపంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ దగ్గరద వదిలేశారు. ర్యాపిడో బుక్ చేసి, బాలుడ్ని సామర్లకోటలోని అతడి ఇంటికి తీసుకెళ్లేలా చూశారు. ర్యాపిడో డ్రైవర్ బాలుడిని సురక్షితంగా సామర్లకోట తీసుకొని వెళ్లారు. దొరికిపోతామేమోనని కిడ్నాపర్లు భయపడి.. బాబుని భద్రంగా ఇంటికి పంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.