ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్‌న్యూస్. చాలా రోజుల గ్యాప్ తర్వాత రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీద రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. శనివార (ఈ నెల 11వ తేదీ) ఉదయం 9 గంటల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్ కం రైలు బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలో సెప్టెంబరు 27 నుంచి రాకపోకలు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీకి పూర్తిగా మరమ్మతులు పూర్తి చేసి.. 11వ తేదీ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. సాధారణ, లైట్ వెయిట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సూచనల మేరకు మోటారు సైకిళ్లు, లైట్ మోటారు వెహికిల్స్, ఆటోలు, లగేజీ గ్యారేజీ లేని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి నిబంధన మేరకు వాహనాలు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రయాణం కొనసాగించాలన్నారు.
రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై సెప్టెంబర్ 27 నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేసి సుమారు రూ.2 కోట్ల నిధులతో మరమ్మత్తుల పనులు ప్రారంభించారు. అక్టోబరు 26 వరకూ బ్రిడ్జిపై రాకపోకలు నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ మరోసారి ఆ గడువును నవంబర్ 10 వరకు పొడిగించారు. ఆర్‌అండ్‌బీ అధికారుల అభ్యర్థనతో పనులు పూర్తి చేసేందుకు గడువు పెంచారు. శుక్రవారంతో ఆ పనులు పూర్తవుతాయని.. శనివారం నుంచి రాకపోకల్ని అనుమతిస్తామన్నారు. ఈ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా కీలకం. కొవ్వూరు వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఇటీవల కాలంలో ఈ బ్రిడ్జిపై మరమ్మత్తుల పనుల్ని చేపట్టారు. ప్రతి రోజూ కొవ్వూరు వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచే వెళతారు. ఈ బ్రిడ్జిని క్లోజ్ చేస్తే విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.. లేదంటే గామన్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని చెబుతున్నారు.