చిక్కబళ్లాపూర్‌లోని ఓ దోమను ఆగస్టులో పరీక్షకు పంపగా.. అందులో జికా వైరస్ ఉన్నట్లు ఫలితాల్లో వెల్లడయ్యింది. జికా వైరస్‌కు ఏడెస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారిగా ఈ వైరస్ 1947లో ఆఫ్రికా ఖండంలో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బాధితుల్లో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్లనొప్పులు, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, గర్బం దాల్చిన మహిళలు మాత్రం ఈ వైరస్ బారినపడితే పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
మహారాష్ట్రలో ఓ మహిళకు జికా వైరస్ నిర్దారణ అయ్యింది. పుణేలోని యరవాడకు చెందిన 64 ఏళ్ల మహిళకు జికా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు హెల్త్ అడ్వైజరీ జారీచేసింది. దోమల వృద్ధి ప్రదేశాలను నాశనం చేయడం, వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించాలని స్పష్టం చేసింది. పొరుగున ఉన్న కర్ణాటకలో జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్ సింగ్ సర్నాయకర్ లేఖ రాశారు.
ఇక, బాధిత మహిళ ఇటీవలే కేరళకు వెళ్లి వచ్చారని, అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తోంది. ‘యరవాడకు చెందిన 64 ఏళ్ల మహిళకు జికా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.. నవంబరు 5న బాధిత మహిళకు మొదట జ్వరం వచ్చింది.. తీవ్రం కావడంతో నవంబరు 10న రక్త నమూనాలను సేకరించి నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పరీక్షల కోసం పంపాం.. నవంబరు 11న వచ్చిన ఫలితాల్లో జికా వైరస్‌గా తేలింది.. అక్టోబరు 15న ఆమె కేరళకు వెళ్లింది.. అక్కడే వైరస్ సోకి ఉంటుంది.. ప్రస్తుతం బాధిత మహిళ పరిస్థితి నిలకడగా ఉంది.. ఆమె కుటుంబంలోని ఐదుగురు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాం’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఎడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ గర్భిణీలకు సోకితే పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపులో పిల్లలు సరిగ్గా ఎదగకపోవడం, తక్కువ బరువు వంటి సమస్యలతో పుడతారు. వారి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. గర్భిణీలకు ఈ వైరస్ సోకితే.. వారికి పుట్టిన పిల్లలు చాలా వరకూ ఇలానే ఉంటారు. దీంతో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జికా సోకితే కొంతమందికి తేలికపాటి లక్షణాలు ఉంటాయి. అయితే మరి కొందరికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇదే ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. చాలా వరకూ ఈ వైరస్ దోమల కారణంగా వ్యాపిస్తుంది. కాబట్టి.. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిండుగా బట్టలు వేసుకోవడం.. వీలైనంత వరకూ తలుపులు, కిటికీలకు మెస్‌లు పెట్టించడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa