తిరుమల శ్రీవారి భక్తులు అప్రమత్తం అయ్యే సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యనుగ్రహ విశేష హోమాన్ని తలపెట్టింది టీటీడీ.. ఇందుకోసం కాసేపట్లో అంటే.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టికెట్లు విడుదల చేయనుంది. టికెట్ ధర ఇప్పటికే రూ. 1000గా నిర్ణయించింది టీటీడీ.. ఆన్‌లైన్‌లో మధ్యా్హ్నం 2 గంటలకు అందుబాటులో ఉంచనుంది.. ఇక, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.
ఈ నెల 23 నుండి అలిపిరి వద్దనున్న గోశాలలో శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించామని.. ప్రతి రోజు వంద టికెట్లను కేటాయిస్తాం.. ఆన్‌లైన్‌లో 50 టికెట్లు ఇస్తే.. ఆఫ్‌లైన్‌లో మరో 50 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. వెయ్యి రూపాయిలు ఇచ్చి హోమంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి దర్శన సౌకర్యం ఉండదు అని స్పష్టం చేశారు.
ఇక, హోమంలో దంపతులు ఇద్దరూ మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని.. టికెట్ తీసుకున్నాం కదా అని.. కుటుంబ సభ్యులు మొత్తం వస్తే కుదరదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.. ఇక, బుధవారం రోజు శ్రీవారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు.. అందులో 26,689 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.