ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వివాదం సాగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. కొంత కాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ ఇంచార్జి బుద్ద ప్రసాద్. అసలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బుద్ద ప్రసాద్ విరుచుకుపడ్డారు.
టీడీపీ ఆరోపణలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుద్ధ ప్రసాద్ రైతులకు కనీసం సాగునీరు అందించలేకపోయాడని, అవుట్ ఫాయిల్ స్లూయిజ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎదురు దాడికి దిగారు. కాలువల అభివృద్ధి పేరుతో అవినీతికి పాలపడ్డారని ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు…తాజాగా రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేశాయి. ఇదికాకుండా వైసీపీ జెండాలు తగులబెట్టడం, కొత్తగా కట్టిన జెండా దిమ్మెలను పగలగొట్టడం తో ప్రశాంతంగా ఉన్న అవనిగడ్డలో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.