భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళలంటే గౌరవం లేదని, నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమని మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అక్కినేని వనజ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నంద్యాలలో ఏపీ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సాయంత్రం టెక్కె మార్కెట్ యార్డు ఆవరణ నుంచి శ్రీనివాససెంటర్ మీదుగా మున్సిపల్ టౌన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్ హాల్ ఆవరణలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన ఘటన సిగ్గుచేటని అన్నారు. అర్ధనగ్నంగా మహిళలను ఊరేగించడం దురదృష్టకరమని, 76 ఏళ్ల స్వతంత్ర భారతావనికి ఈ ఘటన మాయని మచ్చ అని, మణిపూర్ ఘటనపై ప్రధాని ఖండించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 28 దేశాల్లో మహిళల నేతృత్వంలో దేశ పాలన సాగుతున్నదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికార లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, నియంత్రించడంలో పాలనాయంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి జైళ్ళల్లో పెడుతున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. హక్కుల సాధన కోసం మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలని, రక్షణ చట్టాల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు.