దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్యహత్య ఘటనపై నిజాలు నిగ్గు తేల్చడానికి సీఎం జగన్ సీఐడీ విచారణకు ఆదేశించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి వనిత మీడియాతో మాట్లాడారు. ‘కొవ్వూరు మండలం దొమ్మేరులో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నాకు సంబంధం లేకపోయినా కొంతమంది మహేంద్ర మరణాన్ని స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం అత్యంత బాధాకరం. దొమ్మేరు పరిణామాలను సీఎం జగన్‌కు శుక్రవారం నూజివీడులో జరిగిన కార్యక్రమంలో వివరించా. మహేంద్ర మరణంపై అన్ని వాస్తవాలు బయటకు వచ్చేలా నేను విచారణ కోరాను. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సీఐడీ విచారణకు ఆదేశించారు. నియోజకవర్గంలో రాజకీయంగా వైసీపీని ఎదుర్కోలేక తనపై, ప్రభుత్వంపై జనసేన పార్టీ నేతలు రాజకీయ కుట్ర చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు సీఐడీ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరా. నవంబరు 13న జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి పెనకనమెట్ట గడప గడపకు కార్యక్రమంలో ఆమె భర్త పోసిబాబు మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. తన అన్నగారి అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారని చెప్పడంతో వెంటనే పీఏ ఉమాతో పోలీసులకు ఫోన్ చేయించా. అనంతరం ఏం జరిగిందో జడ్పీటీసీ గాని, బంధువులుగానీ నాకు తెలపలేదు. నవంబరు 14న పెనకనమెట్టలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నాయకుల ద్వారా తెలిసింది. చాగల్లు నుంచి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారని తెలియడంతో బొల్లినేని వైద్యులకు ఫోన్‌చేసి మెరుగైన వైద్యం అందజేయాలని సూచించా. 15న ఏలూరు డీఐజీ ఫోన్ చేసే వరకు మహేంద్ర చనిపోయినట్టు తెలియదు. కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియవు’ అని వనిత వివరించారు.