పుట్టపర్తిలో శ్రీసత్యసాయి 98వ జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో వేణుగోపాలస్వామి రథం ముందు సాయి విద్యార్థులు వేదమంత్రాలు వల్లిస్తూ.. చిన్నారుల సంప్రదాయ నృత్యాల చేస్తుండగా.. వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవాన్ని సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ సంగీతకారిణి మాన్య అరోరా బృందం గానకచేరీ నిర్వహించింది. సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలతో భక్తులను మైమరపించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
అంతర్జాతీయ వైద్యశిబిరం ఏర్పాటుచేసి రోగులకు సేవలందిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గీతా కామత్ నేతృత్వంలో 8 రోజుల పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఐసీయూ, ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, కేన్సర్, డెర్మటాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, ఫిమేల్ ఓపీడీ, ఆర్థోపెడిక్, సైకియాట్రిక్ సేవలు అందజేస్తారు. రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకూ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. అవసరమైన మందులను సైతం ఉచితంగా అందిస్తారు.
నవంబరు 23 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే హాజరవుతున్నారు. అలాగే, నవంబరు 22న జరిగే సత్యసాయి విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్‌లు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భారత వాయుసేన విమానంలో బెంగళూరు నుంచి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి ద్రౌపది ముర్ము చేరుకుంటారని అధికారులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయిభక్తులంతా తరలివచ్చే ఈ విశ్వవేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మహానారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాదాల వితరణ చేపట్టారు. సత్యసాయి జయంత్యుత్సవాలు జరిగే ఆరురోజులూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భక్తులకు అన్నప్రసాదాలు వితరణ ఉంటుంది. సుమారు లక్ష మందికి అన్నదానం చేసే లక్ష్యంతో ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వెనుక వైపు ఉన్న మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సత్యసాయి ట్రస్ట్.