ఏపీలో మందబాబులకు బ్యాడ్‌న్యూస్.. ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచింది. రాష్ట్రంలో వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్నఏఆర్‌ఈటీని ( అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని ).. ఇకపైన ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది.. వ్యాట్, ఏఈడీనీ సవరించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.
కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్ సీసా రూ.10-40 వరకూ, హాఫ్ బాటిల్ రూ.10-50 వరకూ, ఫుల్ బాటిల్ రూ.10-90 వరకూ పెరిగాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గగా.. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరిగాయి. అధికంగా అమ్ముడుపోని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి చేరింది. అయితే కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గాయి.
ఫారిన్ లిక్కర్ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలంగా ఫారిన్ లిక్కర్‌పై ధరలు సవరించలేదని, పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20శాతం పెంచారు. కొత్తగా వచ్చే బ్రాండ్లకు వారు నిర్ణయించిన ధర లేదా పక్క రాష్ట్రాలకు అవే బ్రాండ్లు సరపరా చేసే ధర.. రెండింటిలో ఏది తక్కువైతే దానిని పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇస్తామన్నారు. విదేశీ మద్యం బ్రాండ్ల కొనుగోలు ధరలు పెంచటం వల్ల ఆయా బ్రాండ్ల ఎమ్మార్పీ పెరుగుతుంది.