అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 2.85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ పాడి రైతన్నల ఇళ్లలో సిరులను పొంగిస్తోంది. మూడు జిల్లాలతో మొదలైన అమూల్ ప్రస్థానం ఇప్పటికే 19 జిల్లాలకు విస్తరించి గ్రామగ్రామాన క్షీరాభిషేకం చేస్తోంది. మూతపడ్డ డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో సహకార రంగంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ పాల సేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం 2023 తీసుకొచ్చింది. అమూల్ వచ్చిన తర్వాత ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచడంతో లీటర్‌కు రూ.4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవుపాలకు రూ.53.86 చొప్పున ధర లభిస్తుండడంతో అమూల్‌కు పాలు పోసే వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీలు సైతం అనివార్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల పాడి రైతులకు అదనంగా మేలు జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కృషి ఫలితంగా మూతపడిన చిత్తూరు డెయిరీతో సహా సహకార సంఘాలు జీవం పోసుకుంటున్నాయి.