టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే... ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ నాని ఛాలెంజ్ చేశారు. సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసే జగన్ గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారని.. త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.