తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో కార్తీక మహాదీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపోత్సవం అందరిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచ హైందవ సంస్కృతిని కాపాడేందుకు.. ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు టీటీడీ మహత్తరమైన భక్తిచైతన్య ఉద్యమాన్ని చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా 2021వ సంవత్సరం నుంచి కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్తీక మహా దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది మొదటగా ఈ రోజు ఆ దేవ దేవుడి పాదాల చెంతన పెద్ద ఎత్తున కార్తీక మహా దీపోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల లోకానికి కలిగే ప్రయోజనం గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించగలుగుతున్నామని తెలిపారు. అజ్ఞానమనే చీకట్లను పారదోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ప్రజల్లో భక్తి చైతన్యం మరింతగా నింపడానికి రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసిన 18 నుంచి 25 ఏళ్ళ లోపు వయసు ఉన్న యువతీయువకులకు వారితో పాటు కుటుంబ సభ్యులకు ఒక సారి స్వామివారి బ్రేక్ దర్శనం కూడా కల్పించాలని తమ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. సులభశైలిలో భగవద్గీతను కోటి పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. విశేష పర్వదినాల్లో భక్తులు తమ గోత్ర, నామాలతో సంకల్పం చేసుకుని హోమం చేసుకునేందు కోసం ఈ నెల 23వ తేదీ నుండి అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదన్నారు కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి. ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందన్నారు. దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
ఈ మాసంలో నాగులచవితి, భైరవాష్టమి పర్వదినాలు రావడం శుభసూచికమని చెప్పారు. పూజ కంటే స్తోత్రం, స్తోత్రం కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితి కోటి రెట్లు ఉత్తమమైనవన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఈ స్థితిని సాధించాలని కోరారు. దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa