ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్ న్యూస్ వినిపించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుంచి ప్రారంభం కానుందని జగన్ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535 ద్వారా వీలు కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జీవో కింద.. అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల మంజూరు కోసం తమ వివరాలను http://ipr.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
నవంబర్ 23వ తేదీ నుండి ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని.. 45 రోజుల్లోగా (2024 జనవరి 6వ తేదీ) పైన తెలియజేసిన వెబ్సైట్లో జర్నలిస్టులు సంబంధిత వివరాలతో ఆన్లైన్లో తమ దరఖాస్తును సమర్పించాలని అధికారులు తెలిపారు. అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు కేటాయిస్తున్న ఇళ్ల స్థలం విలువలో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాలని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జర్నలిస్ట్ అక్రిడిటేషన్ వివరాలను, జర్నలిస్ట్‌గా వారి వృత్తి అనుభవాన్ని ప్రాథమికంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టుల జాబితాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నారు. జిల్లా కమిటీలు నిబంధనల మేరకు జర్నలిస్టుల అర్హతను పరిశీలించి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి సరైన స్థలాలను జిల్లా పరిధిలోనే గుర్తించనున్నారు.
ఇప్పటికే తాము సరైన స్థలాలను గుర్తించే విధంగా జిల్లా స్థాయి కమిటీలను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశామని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన అక్రిడిటేటెడ్ జర్నలిస్టులందరూ నిర్ణీత సమయంలో ఆన్లైన్లో తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించి ఇస్తున్న ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.