రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. అణగారిన వర్గాలను జగన్ గుర్తించి, గౌవరం ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారన్నారు. 139 వెనుకబడిన కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ లు ఏర్పాటుచేసి నిధులు, విధులు ఇచ్చి ఆత్మాభిమానాన్ని జగన్ పెంచారన్నారు. సాధికారత అనేది పూర్తి కాలేదని, జగన్ ఇప్పుడిప్పుడే ఆరంభం చేసి దీనిని మహా విప్లవమై విస్తరించాల్సి ఉందన్నారు. జగన్ సాధికారత జెండాను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని, దీనికి ఎగురవేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న అంశాన్ని ఆయా వర్గాలకు చెందిన ప్రజలు గుర్తించాలని తమ్మినేని కోరారు. రాజ్యాంగంలో వెెనుకబడిన వర్గాలకు అన్ని అంశాలను పొందుపరిచినా ఎవరికీ చేరలేదని, జగన్ ప్రభుత్వంలోనే రాజ్యాధికారం, రాజ్యాంగ పదవులు వచ్చాయన్నారు. పేదరికం విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి అడ్డంకి కారాదని ప్రమాణం చేసిన నాడే సీఎం జగన్ చెప్పారని, దానిని ఆచరణలో కూడా పెట్టి చూపారని వివరించారు. పేదరిక నిర్మూలన చేస్తూ, జీవన ప్రమాణాలు పెంచుతూ జగన్ చేసిన పాలనతో రాష్ట జీడీపీ రెండు అంకెల గణంకాల్లోకి చేరిందని, పేదల ఆర్థిక శక్తి, కొనుగోలు శక్తి కూడా విశేషంగా పెరిగిందన్నారు.