ఆస్ట్రేలియాలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారత సంతతి విద్యార్థిని వైద్యులు మెడికల్లీ ఇన్‌డ్యూస్డ్ కోమాలో పెట్టారు. బాధిత యువకుడు యూనివర్సిటీ ఆఫ్ టాస్మేనియాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ నెల 5న ఉదయం 4.20 గంటలకు భారతీయ యువకుడిపై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడికి మెదడు శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది. అతడి కుడి ఊపిరితిత్తులకు బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు.
దాడి జరిగిన రోజునే నిందితుడు బెంజమిన్ డాడ్జ్ కాలిన్స్‌ను (25) కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిపై క్రిమినల్ కోడ్ అసాల్ట్ నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి గరిష్ఠంగా 21 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇది జాత్యాహంకారంతో చేసిన దాడిగా భావించేందుకు అధారాలేవీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు, కోలిన్స్‌కు మెజిస్ట్రేట్ బెయిల్ జారీ అయ్యింది. డిసెంబర్ 4న మరోసారి కోర్టు ముందుకు హాజరుకానున్నాడు.