ఏపీలోని జగన్ సర్కార్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ప్రతి మండలంలో రోజుకొక సచివాలయంలో నిర్వహించబడును. గ్రామ పంచాయిలతో పాటు..పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఎలాంటి మేలు జరిగిందో 'ప్రజాతీర్పు'సర్వేతో కార్యక్రమాలు చేపడతారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్‌మెంట్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు.
ఆదిలోనే హాంసపాదు అన్నట్టు ఈ కార్యక్రమం ప్రారంభంలోనే అడ్డంకులు ఏర్పాటయ్యాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై అభ్యంతరం తెలుపుతూ కట్టేపోగు వెంకయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో కట్టేపోగు వెంకయ్య తరపున లాయర్లు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ లు పిటిషన్ దాఖాలు చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. సజ్జల సూచనల మేరకే ఉద్యోగులు పాల్గొంటున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు.