హమాస్ చెరలోని బందీల విడుదల కొనసాగుతోంది. కొద్ది గంటల జాప్యం అనంతరం రెండో విడతలో 17 మంది బందీలను విడుదల చేసింది. 14 మంది ఇజ్రాయేలీలు, నలుగురు థాయ్ పౌరులు సహా 17 మంది ఆదివారం ఇజ్రాయేల్‌కు చేరుకున్నారు. వీరిని రఫా సరిహద్దుల వద్ద అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగిస్తున్న ఫుటేజ్ స్థానిక మీడియాలో ప్రసారం అవుతోంది. విడుదలైన ఇజ్రాయేలీ పౌరుల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, ఓ టీనేజర్ ఉన్నట్టు ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. గాజాకు మానవతా సాయం అందజేయడంలో తాత్సారం అసంతృప్తితో ఉన్న హమాస్.. బందీల విడుదలకు వెనుకాడింది. దీంతో అనుకున్న సమయానికి బందీల విడుదల కావడం లేదు. తొలి విడతలో శుక్రవారం 24 మందికి హమాస్ విముక్తి కల్పించగా.. ఇజ్రాయేల్ జైలు నుంచి 39 మంది పాలస్తీనా పౌరుల్ని విడుదల చేసింది.
ఈ ప్రక్రియ సజావుగా సాగింది. థాయ్‌లాండ్‌కు చెందిన 10 మంది, ఓ ఫిలిప్పీన్స్ జాతీయుడు హమాస్ చెర నుంచి విడుదలయ్యారు. బందీలకు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బందీలు కోలుకుంటున్నారని, వారిని కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇజ్రాయేల్ సైన్యం వెల్లడించింది. అయితే, రెండో దశలో శనివారం 14 మందిని హమాస్.. ఇజ్రాయేల్ 40 మందికిపైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయేల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50 మంది బందీలను హమాస్.. 150 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయేల్ విడుదల చేయాలని అంగీకరించాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి బందీల విడుదల ప్రక్రియ మొదలయ్యింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రెండో దశలో 17 మందిని హమాస్ అప్పగించగా.. 33 మంది మైనర్లు సహా 39 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయేల్ అప్పగించింది. దౌత్యం గురించి తెలిసిన పాలస్తీనా అధికారి మాట్లాడుతూ.. ఇజ్రాయేల్‌తో అంగీకరించిన నాలుగు రోజుల సంధిని హమాస్ కొనసాగిస్తుందని అన్నారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయేల్‌పై హమాస్ విరుచుకుపడి.. 1,400 మందిని చంపి, 240 మందిని బందీలుగా పట్టుకున్న విషయం తెలిసిందే. దాదాపు 50 రోజుల తర్వాత మొదటిసారి కాల్పులను నిలిపివేశారు. హమాస్ దాడికి ప్రతిస్పందనగా గాజాపై బాంబులు, ఫిరంగుల వర్షంతో ఇజ్రాయేల్ విరుచుకుపడింది. ఇప్పటి వరకు దాదాపు 14,800 మంది చనిపోగా.. వారిలో 40% మంది పిల్లలు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు.