అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుందని, రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నిర్దేశించిన గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.