ఇసుక అక్రమాలపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఫెర్రీలో ఇసుక కుప్పలపై కూర్చుని దేవినేని ఉమా నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చి మద్దతు తెలిపారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు టీడీపీ నేతలను వారించారు. నిరసనలో పాల్గొన్న దేవినేని ఉమాని, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటని పోలీసులపై ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే ప్రశ్నిస్తున్నటీడీపీ నేతల నోరు నొక్కాలని చూస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమను అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక ఆక్రమ రవాణా అవుతున్న వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆందోళనను విరమించచోమని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.