శ్రీకాకుళం జిల్లా, గార మండల కేంద్రంలోని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే..... ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉరిటి స్వప్నప్రియ పనిచేస్తోంది. కొద్దిరోజుల కిందట బ్యాంకులో తాకట్టు పెట్టిన సుమారు రూ.3కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయమైనట్లు ఖాతాదారులు బ్యాంకు వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్‌ఎంవో స్థాయి అధికారులు బ్యాంకులో ఆరా తీసి ఆడిట్ నిర్వహించారు. దీనిపై డిసెంబర్ 8న వివరాలు వెల్లడిస్తామని, మూడు నెలల కోసారి జరిగే ఆడిట్ కారణంగానే ఖాతాదారులకు ఆభరణాలు ఇవ్వడంలో అలసత్వమైందని ఆర్‌ఎంవో ఖాతాదారులకు వివరించారు. అయితే ఈ విషయంలో బ్యాంకులో పనిచేస్తున్న ఒక మహిళ, మహిళా మేనేజరే కారణమని కథనాలు వచ్చాయి. సోషల్‌మీడియాలో కూడా ప్రచారం సాగింది. దీంతో స్వప్నప్రియ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయం తన తల్లి సరళకు చెప్పి మథనపడింది. ఈ క్రమంలో ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లిన స్వప్నప్రియ ఇంటికి వచ్చిన కొంత సేపటికి వాంతులు చేసుకుంది. దీనిపై తల్లి ఎంత అడిగినా చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత బ్యాంకులో ఆరోపణలు వివరించి.. తన బతుకు ఇలా అయిపోయిందంటూ బాధపడింది. ఉప్పునీరు తాగి, వేడి నీటితో నోరు పుక్కలించి గదిలోకి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఆమె స్వయంగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో తాను ఎలుకల మందు తాగానని, మందులు వేసుకున్నానని తల్లికి వివరించింది. రెండు రోజుల వరకు అప్పుడప్పుడు వాంతులు అవుతాయని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పేర్కొంది. కాసేపటికి మనసు బాగోలేదని ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది. నాలుగు రోజులైనా వాంతులు అవుతుండడంతో డాక్టర్‌కు చూపిద్దామని తల్లి మందలించింది. దీంతో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు చేయించింది. మెరుగైన చికిత్స కోసం మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో స్వప్నప్రియ మృతి చెందింది. తల్లి సరళ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్‌ఐ లక్ష్మి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ప్రియ స్వగ్రామమైన నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి తరలించారు.