ఇజ్రాయెల్-హమాస్‌మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ ఒప్పందం పొడిగింపుపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సంధి ముగిసినట్లైంది.దీంతో గాజా లో మళ్లీ భూతల దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశస్థుల బందీల విడుదల కోసం గాజాలో కాల్పుల విరమణ డీల్‌కు ఇజ్రాయెల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఖతార్, ఈజిప్టు వంటి దేశాల దౌత్య యత్నాలతో ఇరువర్గాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. తొలుత నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. నవంబరు 24న ఈ ఒప్పందం అమల్లోకి రాగా.. ఆ తర్వాత దీన్ని మరో రెండు సార్లు పొడిగించారు.
అలా మొత్తంగా వారం రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగగా.. శుక్రవారం ఉదయం 7 గంటలతో ఆ ఒప్పందం గడువు ముగిసింది. ఈ సంధికాలంలో కాలంలో హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేసింది. అటు ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న 240 మందికి పైగా పాలస్తీనా వాసులను విడుదల చేసింది. వీరంతా మహిళలు, చిన్నారులేవాస్తవానికి ఈ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హమాస్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ఆరోపించింది. ఒప్పందం సమయంలో గాజా నుంచి తమపైకి రాకెట్లు ప్రయోగించిందని పేర్కొంది. మరోవైపు, సంధి ముగియడంతో గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టింది. ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బాంబు పేలుడు, కాల్పుల చప్పుళ్లు వినిపించాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. జెరూసలెంలో గురువారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు పాలస్తీనా సాయుధులు జెరూసలెంలోని వైజ్‌మన్ స్ట్రీట్ బస్టాప్‌లో నిల్చుని ఉన్న ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు గాయపడ్డారు.