ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు.. ఆ సమయంలో స్వామివారే ప్రాణభిక్ష పెట్టారన్న టీడీపీ అధినేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 08:55 PM

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన చంద్రబాబుకు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.


ధర్మపరిరక్షణ క్షేత్రంమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నానన్నారు చంద్రబాబు. తాను వేంకటేశ్వర స్వామి పాదపద్మాల చెంత పుట్టానని.. అంచెలంచెలుగా పెరిగి ప్రజా సేవకు అంకితం అయ్యానన్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని.. ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రార్థించిన తర్వాతే ఏ‌ కార్యక్రమమైనా ప్రారంభిస్తానన్నారు. 2003 బ్రహ్మోత్సవాలకు తాను దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో అలిపిరి వద్ద 24 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారని.. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. అదే తన నమ్మకం, తన విశ్వాసమని.. మొన్న తనకు కష్టం వచ్చినప్పుడు వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానన్నారు.


మొట్టమొదటి సారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే వేరే కార్యక్రమం చేస్తానని మొక్కుకున్నానని.. ఆ మొక్కును తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చానన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఎల్లప్పుడూ తలచుకుంటూనే ఉంటానని.. ఆయన్ను తలచుకున్న తర్వాతే ఏ పనికైనా శ్రీకారం చుడుతానన్నారు. ధర్మాన్ని కాపాడాలని మాత్రమే ఆయన్ను కోరుకుంటానని.. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడి అవతారంలో పుట్టి, ధర్మాన్ని రక్షించేందుకు ఆయన రావడం జరిగిందన్నారు.


భారతదేశం ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉండాలనేది తన కోరికని.. భారతదేశంలో తెలుగుజాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది తన ఆకాంక్ష, దాని కోసమే పనిచేస్తున్నాను అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యున్నత నాగరికత భారతదేశానిదని.. అందులో తెలుగు ప్రజానికం ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మనస్సు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. తన ద్వారా ప్రజల సంకల్పం ముందుకు తీసుకుని వెళ్లేందుకు శక్తిని తనకు ఇవ్వాలని స్వామిని ప్రార్థించానన్నారు.


తాను కష్టాల్లో ఉన్న సమయంలో ప్రపంచంలో ఉండే ప్రజలంతా తమ సంఘీభావం తెలిపారని.. వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడనని.. కొండపై గోవింద నామస్మరణ తప్ప వేరే ఏవీ కూడా పలకడానికి వీల్లేదన్నారు. అన్ని విషయాలు రాబోయే రోజుల్లో అందరికి తెలియజేస్తానని.. 45 ఏళ్లగా ప్రజల కోసం ఎప్పటికప్పుడు అధ్యాయనం చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ వచ్చానన్నారు. ఇప్పటికే భారతదేశంకు మంచి గుర్తింపు వచ్చిందని.. అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. వేంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో ఉన్న తెలుగుజాత, భారతీయులు కూడా ముందు ఉండాలని.. ఆ సంకల్పం కోసం తాను పని చేస్తానన్నారు.


స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కంటికి సర్జరీ కావడంతో విశ్రాంతి తీసుకున్నారు. ఈలోపు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీంతో స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళతారు. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు.. శనివారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని.. ఈ నెల 3న సింహాచలం అప్పన్నను దర్శనానికి వెళతారు. ఈ నెల 5న శ్రీశైలం మల్లనన్నను కూడా దర్శించుకుంటారు చంద్రబాబు. మరోవైపు టీడీపీ అధినేత పార్టీ కార్యక్రమాలతో బిజీ కానున్నారు.. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే పార్టీ బలోపేతంతో పాటుగా జనసేన పార్టీతో సమన్వయం.. మేనిఫెస్టో, పొత్తులో సీట్ల కేటాయింపుపైనా ఫోకస్ పెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa