విశాఖలో మరోసారి గంజాయి కలకలంరేపింది. నగర పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని కొబ్బరితోట పరిసరాల్లో దాడులు జరిపి, ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ రవిశంకర్, డీసీపీలు శ్రీనివాసరావు, ఆనందరెడ్డిలు స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇంట్లో గంజాయి నిల్వలు చూసిన సీపీ వాటిని తూకం వేసి పరిశీలించారు. పక్కా సమాచారంతో దాడులు చేశామన్నారు సీపీ.
నగరంలో కొరియర్ బాయ్‌ల వేషంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు సీపీ రవిశంకర్. అలా గంజాయిని తరలిస్తున్న వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రస్తుతం గంజాయి అక్రమంగా నిల్వ చేసిన, రవాణా చేస్తున్న వారు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. నగర పరిధిలో కొరియర్ సంస్థల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తిస్తే వారి లైసెన్స్ రద్దు చేయటమే కాకుండా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నవారు గత ఏడాదిన్నరగా గంజాయిని వివిధ రాష్ట్రాలకు, దేశాలకు ఇక్కడి నుంచే అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అయితే ఇంటిని అద్దెకు తీసుకున్న వారి వివరాలు యజమానికి తెలియకపోవటం విశేషమన్నారు. అలాగే ఎవరికైనా ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాక.. వారికి సంబంధించిన అడ్రస్, ఇతర వివరాలు కచ్చితంగా తీసుకోవాలన్నారు.