భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాయా? మోడీ సర్కారు ఈ విషయంలో విఫలమైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద నమోదైన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని కోసం డిమాండ్ పెరిగిందనీ, అయితే, ఇది పెరిగిన నిరుద్యోగాన్ని, గ్రామాల్లో ఉపాధి లేమిని సూచిస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మోడీ పాలనలో గ్రామీణ భారతం ఉపాధి లేక వెలవెలబోతున్నదని అంటున్నారు. ముఖ్యంగా, యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నదని చెప్తున్నారు.
రాజస్థాన్‌లో కోవిడ్-19 మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు.. రాష్ట్రంలో ఉపాధి హామీకి డిమాండ్ అత్యధికంగా ఉన్నది. ఒక ప్రయివేటు సంస్థ సేకరించిన డేటా ప్రకారం.. దాదాపు 70 లక్షల మంది ప్రజలు పనిని డిమాండ్ చేశారు. 2022 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద ఉపాధికి తక్కువగా ఉన్నది. ఇది ఆ కాలంలో ఉపాధి అవకాశాల మెరుగుదలను సూచిస్తుందని నిపుణులు తెలిపారు. అయినప్పటికీ, ఈ ఏడాది జూన్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరుకున్నది. దాదాపు 45 లక్షల మంది ప్రజలు పనిని కోరుతున్నారు. సెప్టెంబరు నాటికి కేవలం 19 లక్షల మంది ఈ కార్యక్రమం కింద పనిని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని కోసం 2020, జూన్‌లో అత్యధిక డిమాండ్ ఉన్నది. 48 లక్షల మంది ప్రజలు పనిని డిమాండ్ చేశారు. 2021 జూన్‌లో 49 లక్షల మంది పనిని డిమాండ్ చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి కేవలం పది లక్షల మంది మాత్రమే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. మేలో పని కోరుతున్న వారి సంఖ్య 34 లక్షలకు పెరిగింది. సెప్టెంబర్ నాటికి 16 లక్షలకు పడిపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో 2020, మేలో గరిష్టంగా 47 లక్షల మంది పనిని కోరారు. 2021, ఫిబ్రవరిలో 33 లక్షల మంది ప్రజలు, ఈ ఏడాది మార్చిలో 26 లక్షల మంది ప్రజలు పనిని కోరారు. అయితే, సెప్టెంబర్‌లో ఇది కేవలం 218,659 మంది పనిని కోరుతున్నట్టు డేటా చూపింది. మిజోరంలో, 2021, మార్చిలో కేవలం 824 మంది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద పనిని డిమాండ్ చేశారు.