ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలపై కేంద్రం విరుచుకుపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయ పార్టీల నేతలపై దాడులకు దిగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.. ఇలా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. తమకు వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష నాయకుల ఇండ్లు, కార్యాలయాల్లో దాడులు, సీజ్‌లు, సోదాలు వంటివి జరిపాయి. అయితే, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేయించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజస్థాన్‌లో..
అక్టోబర్ చివరి వారంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో ఈడీ దాడులు కలకలం రేపాయి. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ దాడులు జరిపింది. జైపూర్, సికార్‌లలో ఆయన ఇండ్లు, కార్యాలయాలలో సోదాలు జరిపింది. కానీ, ఈడీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఉపాధ్యాయుల ప్రవేశ పరీక్ష లీక్ కేసులో దోతస్రా ఇండ్లలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.
అతనితో పాటు దౌసాలోని మహువా స్థానానికి చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ హడ్లా ఆస్తులపై కూడా సోదాలు జరిగాయి. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ లేవనెత్తుతున్న ప్రాథమిక సమస్యలలో సర్వీస్ సెలక్షన్ ప్రవేశ పరీక్షలలో పేపర్ లీక్‌లు ఒకటి. నవంబర్‌లో దోతస్రా కుమారులు అవినాష్, అభిలాష్‌లకు కూడా ఈడీ నుంచి సమన్లు అందాయి. దాదాపు అదే సమయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కూడా ఈడీ సమన్లు అందుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో…
ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ సోదాలు ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభమయ్యాయి. రారుపూర్, దుర్గ్‌లలో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ రాజకీయ సలహాదారు, మాజీ జర్నలిస్ట్ వినోద్ వర్మ, ఇద్దరు అధికారులపై సోదాలు జరిగాయి. ఆ తర్వాత, రారుపూర్, దుర్గ్‌లలో రూ. 14.92 కోట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో నవంబర్‌లో రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ. 508 కోట్ల లబ్దిదారుడిగా ముఖ్యమంత్రిని ఈడీ తన ప్రకటనలో పేర్కొన్నది. సోనీ విడుదల చేసిన వీడియో ఆధారంగా బాఘేల్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. రారుపూర్‌లో సుమారు రూ. 5 కోట్లతో అరెస్టయిన ”క్యాష్ కొరియర్” చేసిన ప్రకటనలో బఘేల్ పేరు ఆసరాగా ఉన్నదని వివరించింది. అయితే ఈ ఆరోపణలన్నీ ”విచారణకు సంబంధించిన అంశం” అని ఏజెన్సీ పేర్కొనటం గమనార్హం.
మధ్యప్రదేశ్‌లో..
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరీతో సహా కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న చాలా మంది ప్రభావవంతమైన వ్యక్తులకు సంబంధించిన రూ. 354 కోట్ల బ్యాంక్ మోసం కేసులో వారిని ఈడీ ఆగస్టులో అరెస్టు చేసింది. 2019లో సీబీఐ మరో కేసులో రతుల్ పూరీ, అతని తండ్రి దీపక్ పూరి, తల్లి నీతా, పూరీకి చెందిన సీ.డీ తయారీ కంపెనీ మోజర్ బేర్ ఇండియా లిమిటెడ్, దాని ప్రమోటర్లపై రుణం విషయంలో బ్యాంకును మోసం చేశారని ఆరోపించింది. ఈడీ కూడా పూరీపై అదే కేసు అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. మోజర్ బేర్‌పై పీఎంఎల్‌ఏ కేసులో బ్యాంక్ ఆఫ్ సింగపూర్ మాజీ రిలేషన్షిప్ మేనేజర్ నితిన్ భట్నాగర్‌ను కూడా ఈడీ ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసేందుకు ఈడీ, ఆదాయపన్ను శాఖ (ఐటీ) పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, సహచరులపై అభియోగాలు మోపేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
మిజోరాంలో
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాత్రం ఈడీ ఎలాంటి దాడులూ నిర్వహించలేదు. రాష్ట్రంలో ఎన్నికల్లో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), ఇతర ఏడు పార్టీల ప్రాంతీయ కూటమి అయిన జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ మధ్య పోటీ ఉన్నది. రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, ఇక్కడ బీజేపీకి రాజకీయంగా ఎలాంటి ఆశలు, అవకాశాలు లేనందునే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ రాష్ట్రంలోకి రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ఎన్నికల ప్రచారానికి సైతం మోడీ రాకపోవటాన్ని వారు ఉదహరిస్తున్నారు.
తెలంగాణలో…
బీఆర్‌ఎస్ పాలిత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితకు ఈడీ తాజా సమన్లు పంపింది. ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఎక్సైజ్ పాలసీలో 849 మద్యం దుకాణాలను ప్రయివేటు సంస్థలకు కేటాయించి, పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ ఢిల్లీ ఎల్జీ వినరు కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేయటంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజరు సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్టయిన ఆప్ కార్యకర్త, వ్యాపారవేత్త విజరు నాయర్ ద్వారా ఆప్‌కి కనీసం రూ. 100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో కవిత కూడా భాగమేనని ఈడీ ఆరోపించింది. కవితతో పాటు, అనేక ఇతర బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఈ దాడులను ఎదుర్కొన్నారు.
పోలింగ్‌కు వారం రోజుల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వివేక్ కంపెనీకి, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య జరిగిన రూ. 8 కోట్ల లావాదేవీకి సంబంధించి ఈడీ దాడులు జరిపింది. వివేక్‌కు చెందిన పలు ప్రాంతాల్లో నవంబర్ 20న సోదాలు జరిగాయి. చెన్నూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న వివేక్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం విదితమే. ఐటీ శాఖ కూడా వివేక్ ఇంటి వద్ద సోదాలు నిర్వహించింది. గతంలో వివిధ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు చెందిన ఇండ్లపై ఐటీ శాఖ, ఈడీ దాడులు నిర్వహించాయి.