ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురయ్యింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోన్న కాంగ్రెస్‌కు నిరాశను మిగిల్చాయి. మూడు రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లో అధికారం తమదేనని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్‌కు అక్కడ ఫలితాలు ఆ పార్టీకి మింగుడపడటం లేదు. గత ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా ఝలక్ ఇచ్చారు. తన వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. దీంతో 14 నెలల్లోనే కమల్‌నాథ్ సర్కారు కూలిపోగా.. మళ్లీ అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది.
బీజేపీ కుట్రలతోనే తమ ప్రభుత్వం కూలిపోయిందని, ఈసారి స్ఫష్టమైన మెజార్టీతో అధికారం చేపడతామని కాంగ్రెస్ నాయకులు అతివిశ్వాసం ప్రదర్శించారు. కానీ, బీజేపీ వ్యూహాలకు హస్తం నేతలు చిత్తయ్యారు. అనూహ్యంగా కేంద్ర మంత్రులను, ఎంపీలను పోటీకి నిలిపి.. స్థానిక నేతల్లో ఉన్న విబేధాలను సమసిపోయేలా చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించే దిశగా అనేక హామీలు ఇచ్చింది. గోధుమలు కనీస మద్దతు రూ.2,700, ధాన్యానికి రూ. 3,100 కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆడపిల్లలకు పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది. లాడ్లీ బెహ్నా పథకం కింద 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న కమలం పార్టీ.. ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచితంగా రేషన్ అందిస్తామని తెలిపింది. ఇవన్నీ కలిసి కాషాయ పార్టీ విజయానికి దోహదం చేశాయి.
ఇక, రాజస్థాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగింది. కానీ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గపోరుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, ఆరోగ్య బీమా పథకం వంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో సానుకూలత ఉన్నా.. వాటిని ఓట్లగా మలచుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. ఇక, వర్గపోరును బయటపడనీయకుండా బీజేపీ తెలివిగా వ్యవహరించింది. ఆ విషయంలో కమలం పార్టీ సఫలమైంది.
ఛత్తీస్‌గఢ్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తల్లకిందులయ్యాయి. ఖచ్చితంగా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. తొలి దశ పోలింగ్ వరకూ పరిస్థితి ఒకలా ఉండగా.. రెండో దశ వచ్చేటప్పటికి పరిస్థితి మారిపోయింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘోల్‌కు మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడి నుంచి రూ.400 కోట్ల అందినట్టు ఈడీ చేసిన ఆరోపణలు ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. దీనినే బీజేపీ కూడా ప్రచారాస్త్రంగా మలచుకుంది. బాఘేల్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు పదే పదేచేసి ప్రచారాన్ని జనం నమ్మినట్టున్నారు. ఇవన్నీ వెరసీ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమికి దారితీశాయి.