ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేసులో యువరాణి దియా కుమారి

national |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 07:48 PM

రాజస్థాన్‌వాసులు మరోసారి తమ సంప్రదాయాన్ని పాటించారు. ఐదేళ్లకు ఓసారి అధికారాన్ని మార్చే ఆనవాయితీని 2023 శాసనసభ ఎన్నికల్లోనూ అమలుచేశారు. ఫలితంగా రాజస్థాన్‌లో అధికారాన్ని హస్తంపార్టీ చేజార్చుకుంది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 101 కాగా.. బీజేపీ పార్టీ మరో పది స్థానాలు అధికంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అయితే ఈ ఎన్నికలకు ముందు తమ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని బీజేపీ పార్టీ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగింది. అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో రాజస్థాన్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటుగా పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా .. వారిలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి ఒకరు.


జైపూర్‌లోని విద్యాధర్ నగర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన దియాకుమారి 53వేల 193 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


దియాకుమారికి లక్షా 58వేల 516 ఓట్లు పోలవ్వగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సీతారామ్ అగర్వాల్‌కు 71,368 ఓట్లు వచ్చాయి. వసుంధర రాజేతో పాటుగా ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. జైపూర్‌ను పాలించిన ఆఖరి మహరాజు మాన్ సింగ్ II మనవరాలే దియాకుమారి. ప్రిన్సెస్ అయినప్పటికీ తన సింప్లిసిటీతో దియా కుమారి డాటర్ ఆఫ్ జైపూర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీధుల్లో తిరిగే యువరాణిగా కూడా కొంతమంది ఆమెను పిలుస్తూ ఉంటారు.


2013లో బీజేపీలో చేరిన దియా కుమారి.. అదే ఏడాది సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 సాధారణ ఎన్నికల్లో రాజ్సామండ్‌ నుంచి ఎంపీగా పోటీచేసిన దియాకుమారి సుమారు ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా కొనసాగుతూనే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 2019లో జాతీయ పులుల సంరక్షణ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. 54 ఏళ్ల దియా కుమారి విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత కోసం పని చేస్తానని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు.


దియాకుమారి తండ్రి బ్రిగేడియర్ భవాని సింగ్ 1989లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్ మూలాలున్న దియాకుమారిని బీజేపీలోకి తీసుకొచ్చింది వసుంధర రాజేనే. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి దియాకుమారిని పరిచయం చేసింది, టికెట్ ఇప్పించింది కూడా వసుంధర రాజేనే. అయితే 2016లో జైపూర్‌లోని రాజ్‌మహల్ ప్యాలెస్ హెటల్ అంశంలో దియాకుమారి, వసుంధర రాజేకు మధ్య విభేదాలు తలెత్తాయి.ఆ తర్వాత ఆ విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సీఎం పదవికి వసుంధర రాజేతో పాటుగా పోటీలో నిలిచారు దియాకుమారి.


ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన దియాకుమారి.. కాంగ్రెస్ అవినీతికరపాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. అభివృద్ధికి రాజస్థాన్‌తో పాటు మూడు రాష్ట్రాల ప్రజలు పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు. ఇక రాజస్థాన్ సీఎంగా ఎవరు ఉంటారనేదీ బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్న దియాకుమారి.. వసుంధర రాజేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com