నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
యువగళం పాదయాత్రకు మూడు రోజులపాటు విరామం ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే అంటే శీలంవారిపాకల నుంచే ప్రారంభం కానుంది.