మిగ్జామ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్‌లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చింది. అలలు అంతెత్తున ఎగసిపడుతున్నాయి.
బాపట్లలో రోడ్లపై వరదనీరు మోకలి లోతుకు చేరింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై కూలడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లాలోనూ పంటనష్టం భారీగా సంభవించింది. వరి, పొగాకు, పసుపు, మొక్కజొన్న, మినుము, ఉలవ పంటలు దెబ్బతినడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా మనుబోలులో రూ. 36.8, తిరుపతి జిల్లా అల్లంపాడులో 35, చిల్లకూరులో 33, నాయుడుపేటలో 28.7, ఎడ్గలిలో 24, బాపట్లలో 21, మచిలీపట్టణంలో 14.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.