ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అత్యధిక జిడిపి కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరిందని అన్నారు. వచ్చే అయిదేళ్ళలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులు అన్న అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మన జిడిపి భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో దేశ జిడిపి 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయిందని అన్నారు.