కేంద్రం విడుదల చేసిన 8,629 కోట్లు మింగేశారని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. లోక్ సభ జీరో అవర్‌లో 'Matters Of Urgent Public Importance' అంశంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2019 నుండి 2023 వరకు విడుదల చేసిన 8,629 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయితీల అకౌంట్ లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచ్ అసోసియేషన్ మెంబెర్స్ తో కలిసి సంబంధిత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కుగతంలో వివరించామని, ఆయన తక్షణమే స్పందించి ఆ నిధులను పది రోజులలోగా తిరిగి వెనుకకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపారని, నోటీసులు పంపి మూడు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, నిధుల కొరత కారణంగా గ్రామాల అభివృద్ధి సరిగా జరగడం లేదని, అలాగే గ్రామాలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందని, దీని వలన గ్రామాలలో పంచాయితీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. వీటిపై సంబంధిత కేంద్ర మంత్రి గారి ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని కోరారు.