మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో జోరువర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సెలవు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు డిసెంబర్ ఐదో తేదీన బాపట్ల సమీపంలో మిచౌంగ్ తుపాను తీరం దాటింది. అయితే తుపాను బలహీనపడినప్పటికీ అనేకచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు వర్షాలు పడే వీలుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు.. అనంతగిరి మండలంలో వాగు దాటుతూ ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. బాధితులు బీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అరకులోయ- విశాఖ ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. కిరండోల్, కొత్తవలస మార్గంలో రైళ్లరాకపోకలు నిలిపివేశారు. తుపాను కారణంగా అనేకచోట్ల భారీ వృక్షాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వందల ఎకరాల్లో పంటనష్టం సంభవించింది.
మరోవైపు బుధవారం తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్విహంచిన సీఎం జగన్.. బాధితులకు అందుతున్న సాయంపై ఆరాతీశారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ సాయం అందించాలని స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు