విశాఖపట్నం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. వైసీపీ సర్కారును విమర్శించేందుకే సభ పెట్టారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సభ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద సెటైర్లు పేల్చారు. జనసేనకు తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడా వస్తాయన్న మంత్రి.. గురువారం నాటి సభతో ఆ విషయం నిరూపితమైందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో జనసేన బలమేంటో చూశామన్న గుడివాడ అమర్నాథ్.. ఎనిమిది చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదని సెటైర్ వేశారు. తెలంగాణ రిజల్ట్స్ చూశాక పవన్ మతిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో బర్రెలక్కతో జనసేన పోటీపడిందన్న గుడివాడ అమర్నాథ్.. ఎన్నికల్లో బర్రెలక్క స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు.ఏపీలోనూ జనసేనకు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు ఏపీతో ఏం సంబంధం ఉందని మంత్రి ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఎన్నిరోజులు ఉన్నారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.
ఏపీలో సొంత నియోజకవర్గం ఏదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో జనసేనాని ఉన్నారని మంత్రి గుడివాడ సెటైర్ వేశారు. గాజువాక, భీమవరాలలో సొంత నియోజకవర్గం ఏదో చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు అబ్రహం లింకన్ స్ఫూర్తి కాదన్న గుడివాడ అమర్నాథ్.. నారా లింకన్ స్పూర్తి అంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీని నాశనం చేసిన పవన్ కళ్యాణ్.. ఏపీలో ఏంచేస్తాడో చూడాలని అన్నారు. పాలిటిక్స్ కోసం కాకుండా పొలిటికల్ కాంట్రాక్టుల కోసం పుట్టిన పార్టీ జనసేన అంటూ విరుచుకుపడ్డారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ విషయంలో తన చొరవతోనే ప్రైవేటీకరణ ఆగిందన్న చెప్తున్న పవన్ కళ్యాణ్‌కు.. ప్రైవేటీకరణ ఆపేశామని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా అంటూ ఐటీమంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. లేక బీజేపీ నేతలు చెప్పారా అంటూ నిలదీశారు. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ దగ్గరుండి చంద్రబాబు నాయుడిని పొగుతున్నారన్న గుడివాడ అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ పాలిట నాదెండ్ల మనోహర్ కట్టప్ప అంటూ అభివర్ణించారు. చివరగా తన అత్తారిల్లు చిట్టివలస అని చెప్పిన గుడివాడ అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదో ఆయనే చెప్పాలని ఎద్దేవాచేశారు.