కృష్ణా జిల్లాలో వరద నీటిలో ఎడ్లబండి, యజమాని ఇరుక్కున్నారు. కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఈ ఘటన జరిగింది. ఇసుక కోసం ఉయ్యూరు మండలం చినఓగిరాల నుంచి తోట్లవల్లూరు వద్ద కృష్ణా నది వద్దకు ఆరు ఎడ్లబళ్లు వచ్చాయి. లోడింగ్ చేస్తుండగా ఉన్నట్లుండి వరద రావడాన్ని గమనించిన కొంత మంది బళ్లతో సహా బయటకు వచ్చేశారు. బందెల శ్రీరాములు ఇసుక లోడింగ్ చేసుకునేలోపే వరద ఉద్ధృతికి బాట తెగిపోయింది. బండి కొట్టుకుపోతుండటంతో యజమాని ఒక ఎద్దు తాడు కోశారు. దాని తోక పట్టుకొని ఒడ్డుకు చేరారు. రెండో ఎద్దును కాపాడేందుకు చేసిన ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. బండితో సహా అది పాములలంక రేవు వరకు కొట్టుకుపోగా ఎద్దు మెడకు తాడు బిగుసుకుపోయి నదిలోనే చనిపోయింది. తర్వాత పడవ సహాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. సుమారు రూ.60వేల విలువ చేసే ఎద్దు మృతి చెందటంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వరద నీటిని వదిలారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ అధికారులు గ్రామాల్లో తెలియజేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.