పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ దొంగ స్టైల్ మార్చాడు. చైనింగ్ స్నాచింగ్ కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. బైక్‌పై వెళ్లి గొలుసులు లాక్కురావడం కాదు.. వాకింగ్‌కు వెళ్లి మహిళల మెడల్లో చైన్‌లు లాగేస్తున్నాడు. వాకింగ్ పేరుతో వెళ్లే ఆ యువకుడు ఒంటరి మహిళల మెడలో బంగారు ఆభరణాలు దోచుకోని పరారయ్యేవాడు. ఇటీవల కాలంలలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో వరుసగా ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో స్థానికంగా రెండు బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు దొరికిపోయాడు.
పార్వతీపురంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు నాలుగు దొంగతనాలు జరిగాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. బొగ్గుల వీధికి చెందిన బి లక్ష్మణరావుపై నిఘా పెట్టారు. అతడు రోజూ రెడ్డివీధి శివారు నుంచి బెలగాం చర్చివీధి వరకు ముఖానికి మాస్కు పెట్టి వాకింగ్ కోసం వెళ్లేవాడు. రామానందనగర్, వైకేఎం.కాలనీ, చర్చివీధి, జనశక్తి కాలనీలో చోరీలకు పాల్పడి.. రైలులో బొబ్బిలి వెళ్లిపోయేవాడు. సీసీ కెమెరాల్లో కనిపించిన బట్టలు.. అతడి ఇంటి దగ్గర ఆరబెట్టి ఉండటంతో అతనే దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని 9.5 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం, బెట్టింగులకు బానిసై చోరీలకు అలవాటుపడినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.