ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వంలో విలీనానికి ముందున్న విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. అన్ని విభాగాల్లో వివిధ కేడర్లలోని అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించిన ఉత్తర్వులను గత వారమే జారీచేయగా.. తాజాగా కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఆదేశాలిచ్చింది. వీరికి ప్రభుత్వంలో విలీనం తర్వాత ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదోన్నతులు కల్పించడానికి ఇబ్బందులు వచ్చాయి.
గతంలో తక్కువ విద్యార్హతలతోనే డ్రైవర్, మెకానిక్ వంటి అనేక పోస్టుల్లో ఆర్టీసీలో ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. దీంతో విలీనానికి ముందున్న పాత విద్యార్హతల ప్రకారమే పదోన్నతులు కల్పించేలా సర్కారు ఆదేశాలిచ్చింది. దీనిపై సీఎం, సీఎస్, ఆర్టీసీ ఎండీకి ఎంఎన్‌యూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయకముందు (2020, జనవరి 1 కంటే ముందు) నుంచి గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించారు. ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి.. గతంలో విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో తాము నష్టపోతామని ఉద్యోగా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.