అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం దిమిలిలో వెలసి ఉన్న బురద మాంబ జాతరని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రెండేళ్లకు ఒకసారి ప్రజలు జరుపుకునే ఈ వేడుకను బురద జాతర అని పిలుస్తుంటారు. ఈ బురద జాతరను స్థానికులు సంబరంగా జరుపుకుంటారు. బురదమాంబగా కొలిచే అమ్మవారిని ఊళ్లోకి స్వాగతించే క్రమంలో అణుపు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా బురద జాతర చేయటం ఇక్కడి ప్రజల ఆనవాయితీ.
తెల్లవారుజామున ఊరంతా వెళ్లి డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి బురదను తీసుకొస్తారు. వేపాకు కొమ్మలు చేతబూని నృత్యం ఆనందంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉత్సవం జరుపుకుంటారు. ఇలా బురద రాసుకోవడం వలన చర్మవ్యాధులు తొలగి ఆరోగ్యంగా ఉంటారని.. ఆ బురదమాంబ చల్లని ఆశీస్సులు తమపై ఉంటాయని ప్రజల విశ్వాసం. డప్పులు కొట్టుకుంటూ గ్రామం మొత్తం తిరుగుతూ కనిపించిన వారి కల్లా బురద జల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ఈ జాతరను గ్రామ ప్రజలు జరుపుకుంటారు.