హర్యాణా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. త్వరలోనే ఓ ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 22 వ తేదీన వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలోనే హర్యాణా, రాజస్థాన్ రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు అందాయి. 3 నగరాల్లో మూడు రిసెప్షన్లను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు 3 లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో వీరి పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 80 గ్రామాలకు చెందిన ప్రజలను ఈ వివాహానికి ఆహ్వానించారు.
హర్యాణా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్. భవ్య బిష్ణోయ్ తండ్రి బీజేపీ నేత, మాజీ ఎంపీ. భవ్య బిష్ణోయ్ ప్రస్తుతం అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ స్వస్థలం రాజస్థాన్. 2019 లో సివిల్స్ పాస్ అయిన పరి బిష్ణోయ్.. సిక్కిం క్యాడర్ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పరి బిష్ణోయ్ సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరగనుంది. ఇక పుష్కర్, అదంపూర్, ఢిల్లీ మూడు నగరాల్లో 3 రిసెప్షన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లి, రిసెప్షన్‌ల కోసం హాజరయ్యేందుకు 3 లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి.
ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్‌కి, ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. రాజస్థాన్‌లోని పుష్కర్ నగరంలో కూడా ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇక భజన్‌లాల్ కాలం నుంచి అదంపుర్ నియోజకవర్గం బిష్ణోయ్ కుటుంబానికి కంచు కోట లాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్క అదంపూర్ నియోజకవర్గంలోని 80 కి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తామని భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్‌దీప్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పెళ్లి సమయంలో కూడా తన తండ్రి భజన్‌లాల్ అదంపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి ప్రజలను ఆహ్వానించినట్లు చెప్పారు. ఆ సమయంలో తన తండ్రి హర్యాణా సీఎంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను అదే చేయబోతున్నట్లు కుల్ దీప్ బిష్ణోయ్ చెప్పారు. మరోవైపు.. ఢిల్లీలో నిర్వహించనున్న రిసెప్షన్‌కు బీజేపీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరవుతారని కుల్ దీప్ బిష్ణోయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. భవ్య బిష్ణోయ్‌కు 2021లో సినీనటి మెహ్రీన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొద్దినెలలకే వారి ఎంగేజ్‌మెంట్ రద్దయింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్‌తో పెళ్లి ఫిక్స్ అయింది.